ఓటు హక్కు పరిరక్షణకు ‘చలో కలెక్టరేట్’
మెదక్లో ఇండియా కూటమి నేతల సమావేశం.. రేపు కార్యక్రమానికి పిలుపు మెదక్, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలపై మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ, పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ముఖ్య నాయకులు సమావేశమై ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షణతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రజా సమస్యలపై చర్చించారు. ఓటు హక్కును కాపాడేందుకు చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై నాయకులు సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, సీపీఐ కార్యదర్శి మల్లేష్, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
