తల్లి ఆరోగ్యమే.. బిడ్డకు ఆయుష్షు!
గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు: తహసీల్దార్ విజయలక్ష్మి వెల్దుర్తి, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుందని, గర్భధారణ నుంచి శిశువు ఎదిగే దశ వరకు సరైన పోషకాహారం అందించడం ఎంతో కీలకమని తహసీల్దార్ విజయలక్ష్మి అన్నారు. గర్భిణీలు, బాలింతలు తీసుకునే ఆహారం తల్లీబిడ్డల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవీలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం పోషకాహార వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శన ఆకట్టుకుంది. సహజసిద్ధంగా లభించే ఆకుకూరలు, కాయగూరలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వివిధ రకాల పిండి వంటలు, పోషక పదార్థాలతో తయారు చేసిన వంటకాలు, స్వీట్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే అదనపు పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించడంతో పాటు తల్లి, శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని అన్నారు. ఇంటివద్ద అందుబాటులో ఉండే ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులకు సమతుల్య ఆహారం అందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. డాక్టర్ శిరీష మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే అదనపు ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఆయా గ్రామాల్లోని సబ్సెంటర్లలో 15 రోజులకు ఒకసారి నిర్వహించే వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు ఐరన్ మాత్రలను వినియోగించాలని తెలిపారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా జన్మిస్తుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే అదనపు పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకుని తల్లులు, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ శిరీష సూచించారు. కార్యక్రమంలో ఏటీఎం సుభాష్ గౌడ్, వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.


