పాపన్నపేట మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ పాటలతో మార్మోగిన గ్రామాలు.. చెరువుల్లో నిమజ్జనంతో ముగిసిన వేడుకలు
తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, అక్టోబర్ 18:
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలు, కాలనీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సాయంత్రం వేళ బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు.
మండల కేంద్రంలోని నీలగైని, కుమ్మరి గైన్, నెహ్రూ స్ట్రీట్, పాత చెరువు, హైస్కూల్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మలను ఒకచోట చేర్చి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ పండుగ సందడిని రెట్టింపు చేశారు.
ఒక్కేసి పూవ్వేసి చందమామ.. ఒక్క జాములో చందమామ.. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.. వంటి సంప్రదాయ బతుకమ్మ పాటలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.
సద్దుల బతుకమ్మ పండుగ చివరి రోజు కావడంతో మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలంతా కలిసి ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేయడంతో వేడుకలు ముగిశాయి. పండుగ సంప్రదాయంలో భాగంగా మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
బతుకమ్మ సంబరాలతో పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాలు, కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బతుకమ్మ ప్రధాన కూడళ్ల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలీసుల పర్యవేక్షణలో మండలవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రశాంతంగా ముగిశాయి.

