మైనర్ డ్రైవింగ్.. ప్రమాదం.. డ్రైవర్, వాహన యజమానిపై కేసు
ఏడుపాయల టీ జంక్షన్ వద్ద ఇన్నోవా, మహీంద్రా థార్ ఢీ కొల్చారం, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): మైనర్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైన ఘటనలో డ్రైవర్‌తో పాటు మహీంద్రా థార్ వాహన యజమానిపై కొల్చారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని ఏడుపాయల టీ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏడుపాయల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు (TS 07 JX 6012) ఏడుపాయల టీ జంక్షన్ వద్ద యూటర్న్ చేస్తుండగా, అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన మహీంద్రా థార్ (TG 15 J 7152) ఇన్నోవా కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇన్నోవా కారు ముందు భాగం దెబ్బతినడంతో పాటు మహీంద్రా థార్ వాహనం ముందు భాగం కూడా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పరిశీలించిన పోలీసులు మహీంద్రా థార్‌ను నడిపిన వ్యక్తి మైనర్‌గా గుర్తించారు. దీంతో మైనర్‌కు వాహనం నడిపేందుకు అవకాశం కల్పించిన వాహన యజమానిపై, అలాగే వాహనం నడిపిన మైనర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.
