పనులు చేయకుండా పాదయాత్రలా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
పదేళ్లలో చేయని అభివృద్ధిని ఇప్పుడు ఎలా నమ్మాలి: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిజాంపేట, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): పనులు చేయకుండా పాదయాత్రలు చేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు. పదేళ్లపాటు అభివృద్ధి పనులు చేపట్టకుండా ఇప్పుడు పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. తాము ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులతోనూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయానికి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ 2022లో చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులను అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్ కారణంగా పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు మళ్లీ పాదయాత్రలు చేయడం సరికాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో సొంత నిధులతోనూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే పలు గ్రామాల్లో తమ ఆధ్వర్యంలో బోర్లు, మోటార్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్లోకి చేరికలు: కల్వకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భవాని వెంకటగౌడ్, ప్రస్తుత వార్డు సభ్యురాలు, పలువురు ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా హనుమంతరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నందిగామ గ్రామానికి చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పలువురు కూడా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. గ్రామంలోని పలు సంఘాలకు చెందిన వారు సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అనంతరం గ్రామ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, సీనియర్ నాయకుడు నాగరాజు, కల్వకుంట సహకార సంఘం చైర్మన్ మహేందర్, మాజీ ఎంపీటీసీ స్వామి, నాయకులు రాజకిషన్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నజీరుద్దీన్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

