హల్దీవాగులో ఇసుక దందాకు ఉక్కుపాదం!
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందా?
అక్రమ దారులు వేస్తే కేసులు.. పట్టాలు సీజ్ చేస్తాం: ఆర్ఐ నర్సింగ్ యాదవ్
వెల్దుర్తి మండలం, అక్టోబర్ 7, తెలుగు ట్రెండ్స్: హల్దీవాగు నుంచి సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇసుక తరలించేందుకు పట్టా భూముల నుంచి అక్రమంగా దారులు ఏర్పాటు చేసే భూ యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు, అక్రమ దారులు ఏర్పాటు చేసిన భూముల పట్టా నంబర్లను సీజ్ చేస్తామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ హెచ్చరించారు.
మండల కేంద్రం సమీపంలోని హల్దీవాగు నుంచి కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టాదారు విట్టల్ జగన్ తన వ్యవసాయ భూమి నుంచి వాగులోకి దారి ఏర్పాటు చేసి, ఇసుక తరలించే ఒక్కో ట్రాక్టర్కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదులపై స్పందించిన ఆర్ఐ నర్సింగ్ యాదవ్ బుధవారం ఇసుక తరలింపు ప్రాంతానికి చేరుకుని తనిఖీ చేశారు. అనంతరం జేసీబీ సహాయంతో అక్రమంగా ఏర్పాటు చేసిన దారిని తవ్వించి, వాహనాలు వాగులోకి వెళ్లకుండా పెద్ద గోతిని ఏర్పాటు చేయించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దందా?
వెల్దుర్తి మండల కేంద్రానికి 65 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 40 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 25 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఇసుక అక్రమ రవాణాదారులు ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుకను తరలించి ఇతర ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇసుక కొరత, రవాణా ఖర్చులు, కూలీ తదితర కారణాలతో ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
మరోసారి దందా చేస్తే పట్టాలే ప్రభుత్వ ఆధీనంలో!
పట్టా భూముల నుంచి వాగులోకి అక్రమ దారులు ఏర్పాటు చేసి ఇసుక రవాణాకు సహకరిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని ఆర్ఐ నర్సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమంగా ఏర్పాటు చేసిన దారులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అవసరమైన ఇసుక రవాణాకు ప్రభుత్వ దారులుగా వినియోగించేలా చర్యలు చేపడతామని హెచ్చరించారు.
హల్దీవాగు నుంచి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు నిరంతరం తనిఖీలు చేపడతామని రెవెన్యూ అధికారులు తెలిపారు.



