Type Here to Get Search Results !

అక్రిడిటేషన్‌ కార్డుల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తే ఉపేక్షించం: ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు



మెదక్, అక్టోబర్ 7, తెలుగు ట్రెండ్స్: అక్రిడిటేషన్‌ కార్డులు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేయడం, మెదక్ ప్రెస్‌క్లబ్‌ పేరును ఉపయోగించి అక్రమ వసూళ్లకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మెదక్ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శివ్వన్నగారి నరసింహ చారి స్పష్టం చేశారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌ భవనంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు నరసింహ చారి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, ప్రెస్‌క్లబ్‌ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేస్తోందని తెలిపారు. మెదక్ జిల్లాలో అక్రిడిటేషన్‌ కమిటీకి సంబంధించి కొందరు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. అక్రిడిటేషన్‌ కార్డులు ఇప్పిస్తామనే పేరుతో జర్నలిస్టుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

అదేవిధంగా మెదక్ ప్రెస్‌క్లబ్‌ పేరును ఉపయోగించి ఎలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం

ప్రెస్‌క్లబ్‌ సభ్యులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నరసింహ చారి తెలిపారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనప్పుడు మెడికల్‌ అసోసియేషన్‌తో మాట్లాడి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

జర్నలిస్టుల పిల్లల పాఠశాల ఫీజుల సమస్యలపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ప్రెస్‌క్లబ్‌ సభ్యులందరి సహకారం, సూచనలతో క్లబ్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

నూతన కార్యవర్గం ఏర్పాటైన తక్కువ కాలంలోనే ప్రెస్‌క్లబ్‌ భవనాన్ని అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. భవిష్యత్‌లో సభ్యుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

అర్హులైన జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం కృషి

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు లేని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు మంజూరయ్యేలా ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కృషి చేస్తామని నరసింహ చారి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంలో ప్రెస్‌క్లబ్‌ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

అనంతరం ప్రెస్‌క్లబ్‌ మౌలిక సదుపాయాల కోసం దాతల సహకారంతో సమకూరిన ఆదాయం, ఖర్చులు, దాతల పేర్లకు సంబంధించిన వివరాలను కోశాధికారి చెవిటి అశోక్‌ సభలో చదివి వినిపించారు.

ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి బచ్చు సంగమేశ్వర్‌, కార్యవర్గ సభ్యులు, ప్రెస్‌క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language