గజ్వేల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి: మంత్రి గడ్డం వివేక్
కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి.. ఎన్నికల సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలి
తెలుగు ట్రెండ్స్, తూప్రాన్: గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పిలుపునిచ్చారు. పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా ఎన్నికల సమయంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
శుక్రవారం తూప్రాన్ ఫ్యాక్స్ చైర్మన్ ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి, పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, విద్యార్థులకు అల్పాహార పథకం, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలను వివరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులు, ఫామ్హౌస్లు, సాగునీటి ప్రాజెక్టుల వినియోగంపై మంత్రి వివేక్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించిన హామీ అమలుపై కూడా ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు: ఆంజనేయులు గౌడ్
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం కాంగ్రెస్ నాయకత్వం బాధ్యతగా తీసుకుంటోందన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి కానీ కాంగ్రెస్ కార్యకర్తకు రిటైర్మెంట్ ఉండదని పేర్కొన్నారు. గజ్వేల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం యువత చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. మైనంపల్లి హనుమంతరావు మార్గదర్శకత్వంలో విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తాం: చిట్కుల మైపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిట్కుల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే నిబద్ధత కలిగిన కార్యకర్తలు కాంగ్రెస్కు ఉన్నారని తెలిపారు. పార్టీ జెండా, ఎజెండాతో ముందుకు సాగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ పార్టీ ఆదేశాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎరుకల నర్సింహ, డైరెక్టర్లు మన్నె ధర్మేందర్, తిరుపతి రెడ్డి, మన్నె తిరుపతి, బాలమణి, రామచంద్ర రెడ్డి, అనిల్ కుమార్, రావెల్లి కృష్ణ, దండు సత్యనారాయణ, సర్పంచులు నాగరాజు, రాము, నాగరాజు, కాంగ్రెస్ నాయకులు జావీద్ పాషా, శశిభూషణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

