వెల్దుర్తిలో సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాభవాని
వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. హోమం, మహాపడి పూజ, అన్నదానంతో ఆధ్యాత్మిక శోభ
వెల్దుర్తి మండలం, అక్టోబర్ 16:(తెలుగు ట్రెండ్స)మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు, కుంకుమార్చనలు నిర్వహించారు. విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా కొలువుదీరిన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు.
లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, సకల జనుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేదమంత్రాల నడుమ శ్రీ దుర్గామాత హోమం, మహాపడి పూజతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను దుర్గాభవాని సేవా సమితి సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పుష్పాలంకరణ, దీపారాధన, మంత్రపుష్పం, మంగళహారతి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమార్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది.
గత 23 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుర్గాభవాని సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.

