లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా చూడాలి
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ మెదక్, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): విద్యుత్ వినియోగదారులకు లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ సూచించారు. సోమవారం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మెదక్ జిల్లాలోని 132/33 కేవీ కౌడిపల్లి సబ్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించి వోల్టేజీలు, లోడ్ల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొల్చారం మండలంలో వరి పొలాలను పరిశీలించి రైతులు పోచయ్య, రాములుతో మాట్లాడి పంటల సాగు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. పంట మార్పిడి ఆవశ్యకతను రైతులకు వివరించారు. అక్కడి నుంచి అంసానపల్లి సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన సీఎండీ, తరచూ విద్యుత్ అంతరాయాలకు గురవుతున్న 11 కేవీ ఫీడర్పై విద్యుత్ అధికారులతో, కొల్చారం లైన్‌మెన్‌తో చర్చించి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అనంతరం అంసానపల్లి సర్పంచ్, తండా సర్పంచ్ జానకిరామ్రెడ్డితో మాట్లాడగా, అంసానపల్లికి ప్రత్యేక 11 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని వారు సీఎండీని కోరారు. అనంతరం 220/132/33 కేవీ మీన్‌పూర్ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ను సీఎండీ పరిశీలించారు. ఇటీవల ఓఎల్టీసీ సమస్య తలెత్తిన 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ పరిస్థితిపై అక్కడి ఏడీఈ, ట్రాన్స్‌కో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాపన్నపేటలో వరి పొలాలను పరిశీలించి రైతులు బైండ్ల అశోక్, సిద్ధిరాం రెడ్డి, యాదగిరి, సిద్ధిరాములుతో పంట సాగు, లాభనష్టాలపై చర్చించారు. వరికి బదులుగా కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల తోటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే మెరుగైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని రైతులకు వివరించారు. ఒక గుంట భూమిలో కోర్రమీను చేపల పెంపకం, మేకల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాల ద్వారా కూడా వరి పంటతో పోలిస్తే అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని సీఎండీ సూచించారు. ఈ సూచనలను రైతులు ఆసక్తిగా విని, ఈసారి ప్రత్యామ్నాయ సాగు విధానాలను ప్రయత్నిస్తామని తెలిపారు. అనంతరం సీఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఈ/ఆపరేషన్స్ రూరల్ జోన్ బాలస్వామి, మెదక్ ఎస్ఈ/ఆపరేషన్స్ నారాయణ నాయక్, డీఈ రామేశ్వరస్వామి, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

