Type Here to Get Search Results !

విద్యుత్‌ లైన్‌ ఆన్‌ చేయడంతో రైతులకు షాక్‌.. నలుగురికి స్వల్ప గాయాలు

 



విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతుల ప్రాణాలకు ముప్పు

విద్యుత్‌ లైన్‌ ఆన్‌ చేయడంతో నలుగురు రైతులకు స్వల్ప గాయాలు.. వరిగుంతం సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన కొల్చారం, అక్టోబర్‌ 1 (తెలుగు ట్రెండ్స్): విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో నలుగురు రైతులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటన కొల్చారం మండలం వరిగుంతం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి రైతుల ప్రాణాలకు ముప్పు కలిగించారని ఆరోపిస్తూ సీతారాం తండాకు చెందిన రైతులు గురువారం వరిగుంతం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యుత్‌ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. బాధిత రైతుల వివరాల ప్రకారం.. సీతారాం తండాలోని సేవాలాల్‌ గుడి వద్ద ఉన్న వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సుమారు 15 రోజుల క్రితం చెడిపోయింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన మరమ్మతులు చేపట్టాలని రైతులు లైన్‌మెన్‌ బాల్యను కోరారు. బుధవారం మధ్యాహ్నం లైన్‌మెన్‌ బాల్య వరిగుంతం సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీశైలంకు ఫోన్‌ చేసి సమాచారం అందించిన అనంతరం లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) తీసుకున్నట్లు రైతులు తెలిపారు. అనంతరం మరమ్మతు పనులు చేపట్టగా లైన్‌మెన్‌తో పాటు మరో నలుగురు రైతులు విద్యుత్‌ స్తంభం ఎక్కారు. అయితే మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఆపరేటర్‌ శ్రీశైలం ఒక్కసారిగా విద్యుత్‌ లైన్‌ను ఆన్‌ చేయడంతో స్తంభంపై ఉన్న రైతులకు ప్రమాదం ఏర్పడిందని వారు ఆరోపించారు. అప్పటికే లైన్‌మెన్‌ బాల్య స్తంభం నుంచి కిందకు దిగివచ్చారు. విద్యుత్‌ ప్రవాహం రావడంతో ఓ రైతుకు స్వల్పంగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో గట్టిగా అరుస్తూ స్తంభం నుంచి కిందకు దూకినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన మిగతా ముగ్గురు రైతులు కూడా వెంటనే కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారని పేర్కొన్నారు. స్తంభం నుంచి కిందకు దూకడంతో రైతులు రమావత్‌ రాజు, బాల్‌సింగ్‌, రెడ్యా, నందులకు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తోటి రైతులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు చెప్పారు. విద్యుత్‌ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించిన రైతులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఏఈ హైమద్‌ అలీ రైతులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. రైతుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్‌ శాఖ అధికారులు భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language