ఆరోగ్యకరమైన తల్లి–బిడ్డలతో ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
అంగన్వాడీల్లో నాణ్యమైన పోషకాహార సేవలు అందించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
తెలుగు ట్రెండ్స్ న్యూస్ | మెదక్, అక్టోబర్ 16:
ఆరోగ్యకరమైన తల్లి–బిడ్డలతో ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ పోషణ మాసం–2026 ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు వయస్సు, అవసరాలకు అనుగుణంగా సమతుల పోషకాహారం అందించాలని తెలిపారు. ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పోషణ మాసంలో భాగంగా నెల రోజులపాటు పోషకాహారం ప్రాముఖ్యత, పోషణ్ ట్రాకర్, జన ఆందోళన్, సమతుల ఆహారం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా మూడు నుంచి ఐదేళ్ల పిల్లల్లో శారీరక, మానసిక, భాషా, మేధో, సృజనాత్మక అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే ప్రీ-స్కూల్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ప్రీ-స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీల్లో నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
అనంతరం పోషణ మాసంలో ఉత్తమ సేవలందించిన అధికారులు, అంగన్వాడీ సిబ్బందిని కలెక్టర్ మెమొంటోలతో సత్కరించారు. అంగన్వాడీ చిన్నారులు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లను సందర్శించి, వారు తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గణేశ్వర్, అదనపు డీఆర్డీఓ సరస్వతి, మెదక్, రామాయంపేట సీడీపీఓలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు, వైద్యశాఖ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


