ఏడుపాయల్లో గాయత్రీ దేవి అవతారంలో వనదుర్గామాత దర్శనం
రెండో రోజు నవరాత్రి ఉత్సవాలకు భక్తుల తాకిడి.. గులాబీ వర్ణంలో అమ్మవారి అలంకరణ
పాపన్నపేట, అక్టోబర్ 12 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని గులాబీ వర్ణంలో అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చారు. ప్రత్యేక మండపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ
నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు అన్నప్రసాదం అందించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఏడుపాయల ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పోలీసుల పటిష్ట బందోబస్తు
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, దీపక్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.


