కరెంట్ కోసం రైతుల రాస్తారోకో
ఎరువులకు చెప్పులు.. విద్యుత్కు రాస్తారోకో.. ఇదేనా రైతు ప్రభుత్వం?
చిన్నశంకరంపేట: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలోని మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో కొనసాగడంతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, విద్యుత్ శాఖ అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈడీ మోహన్ బాబు, ఏఈ దినాకర్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. “అయ్యా.. మీ కాళ్లు మొక్కుతాం.. మాకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వండి” అంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, కుమార్ గౌడ్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టాల్సిన పరిస్థితి, విద్యుత్ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.
వరి పంట ఈనుతున్న కీలక సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, గంగా నరేందర్, సర్పంచ్ సిద్ధిరాములు, పూలపల్లి యాదగిరి యాదవ్, బాచుపల్లి యాదగిరి, సాయం పోచయ్య, రమేష్ నాయక్, ఉపేందర్ రెడ్డి, నాగరాజు, రవీందర్ రెడ్డి, బిక్షపతి, పడాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
