ఈనెల 11 నుంచి ఏడుపాయల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
పాపన్నపేట, అక్టోబర్ 7: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మఠం వీరేశం తెలిపారు. బుధవారం ఆయన ఉత్సవాల వివరాలను వెల్లడించారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారు వివిధ దేవతా అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11న బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో (ముదురు పసుపు), 12న శ్రీ గాయత్రి దేవి అవతారంలో (గులాబీ), 13న శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో (నీలం), 14న శ్రీ మహా చండీ దేవి అవతారంలో (ఆకుపచ్చ), 15న శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో (పెసర), 16న శ్రీ సరస్వతీ దేవి అవతారంలో (తెలుపు), 17న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో (నారింజ), 18న శ్రీ దుర్గాదేవి అవతారంలో (ఎరుపు), 19న శ్రీ మహిషాసుర మర్ధిని దేవి అవతారంలో (మెరూన్), 20న శ్రీ రాజరాజేశ్వరీ దేవి వనదుర్గాదేవి అవతారంలో (పసుపు) భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈఓ తెలిపారు.
ఈనెల 15న దుర్గామాతకు బోనాలు, 19న సువాసిని పూజతో పాటు చండీ హోమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ గోత్రనామార్చన పూజకు రూ.1,116 రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే నవరాత్రుల్లో ఏదైనా ఒకరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు రూ.251 చెల్లించి పూజలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
నవరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈఓ మఠం వీరేశం కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పల్లె సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, దీపక్ రెడ్డి, బలరాం తదితరులు పా
ల్గొన్నారు.
