ఇంటి స్థలం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితుల ఆందోళన
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన.. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్తెలుగు ట్రెండ్స్, తూప్రాన్: తమకు తెలియకుండా తమ ఇంటి స్థలాన్ని ఇతరుల పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ బాధితులు తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, అక్రమంగా జరిగినట్లు ఆరోపిస్తున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి స్థలాన్ని తమ పేరుపై నమోదు చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు మాసనూరి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త మాసనూరి భూమయ్య 2012లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన పేరుపై ఉన్న 357 గజాల ఇంటి స్థలాన్ని తమకు తెలియకుండా దగ్గరి బంధువు మాసనూరి సత్తమ్మ పేరుపై గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె ఆరోపించారు.2013లో తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి గ్రామ కార్యదర్శి సహాయంతో సత్తమ్మ కుమారుడు మాసనూరి రవికుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు బాధితులు ఆరోపించారు. వాస్తవంగా 357 గజాల స్థలం ఉండగా, 440 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు వారు పేర్కొన్నారు.అనంతరం రవికుమార్ 220 గజాలను తన కుమారుడు భాస్కర్ పేరుపై, మరో 220 గజాలను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా పక్కనే ఉన్న ఇతరుల స్థలాన్ని కూడా ఆక్రమించినట్లు వారు ఆరోపించారు. అనంతరం ఇంటి నిర్మాణం కోసం ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.15 లక్షల రుణం పొందినట్లు తెలిపారు.తమకు తెలియకుండా జరిగినట్లు ఆరోపిస్తున్న రిజిస్ట్రేషన్‌పై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు కోరారు. అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ కార్యదర్శిపై, సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే వివాదాస్పద రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించి, అవకతవకలు ఉన్నట్లు తేలితే వాటిని రద్దు చేసి తమ ఇంటి స్థలాన్ని తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని బాధితులు అధికారులను కోరారు.ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.


