పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అప్పగించిన పోలీసులు
589 సెల్ఫోన్లు రికవరీ.. హర్షం వ్యక్తం చేసిన బాధితులు
తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, సెప్టెంబర్ 29: వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో పాపన్నపేట పోలీసులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటివరకు 589 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మీ-సేవ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు అందించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించే చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు మొత్తం 601 సెల్ఫోన్లను గుర్తించగా, అందులో 589 ఫోన్లను (98 శాతం) రికవరీ చేసి సంబంధిత బాధితులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం కూడా మరో 12 సెల్ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధితులకు అప్పగించారు. రికవరీ చేసిన ఈ 12 సెల్ఫోన్ల విలువ సుమారు రూ.2,04,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.పోగొట్టుకున్న సెల్ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన గుర్తించి రికవరీ చేయడంలో పాపన్నపేట పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. గతంలో కూడా పెద్ద సంఖ్యలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి డీఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.తమకు ఎంతో అవసరమైన సెల్ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి తిరిగి అందజేసిన పాపన్నపేట పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు
