చిలిపిచెడ్లో పలుచని జల్లులు
ఎండ తీవ్రతతో వాడుతున్న వరి పంటలకు ఊరట.. రైతుల్లో ఆనందం
చిలిపిచెడ్, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
చిలిపిచెడ్ మండల వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భానుడు భగభగ మండుతున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో వరి పొలాల్లో నీరు వేగంగా ఇంకిపోతూ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా పలుచని జల్లులు కురిశాయి. దీంతో కొంతసేపు వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం లభించింది.
ఎండ తీవ్రతకు వాడిపోతున్న వరి పంటలకు ఈ చిన్నపాటి వర్షం కొంత ఊరటనిచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింతగా వర్షాలు కురిసి పొలాల్లో నీటి కొరత తీరడంతో పాటు పంటలు పచ్చగా కళకళలాడాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
