తూప్రాన్లో ఘనంగా పోషణ మాసోత్సవం
గర్భం నుంచి బిడ్డకు రెండేళ్ల వరకు ‘1000 డేస్’ ప్రాముఖ్యతపై అవగాహన
తూప్రాన్, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
తూప్రాన్ 8వ సెంటర్లో శుక్రవారం పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ మూడవ వార్డు కౌన్సిలర్ సత్య లింగం సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, తల్లులకు పోషకాహారం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని **‘1000 డేస్’**గా పరిగణిస్తారని, ఈ కాలం తల్లి, శిశువు ఆరోగ్యానికి ఎంతో కీలకమైనదని వివరించారు. గర్భిణులు, బాలింతలు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ, పుట్టిన శిశువు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఆకుకూరలు, వివిధ రకాల చిరుధాన్యాలను ప్రదర్శించి, వాటిలో ఉండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తల్లులకు వివరించారు. రోజువారీ ఆహారంలో పోషక విలువలు కలిగిన పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. అనంతరం పోషణపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో మూడవ వార్డు కౌన్సిలర్ సత్య లింగం, ఐసీడీఎస్ సూపర్వైజర్ శివకుమారి, ఏఎన్ఎం సీమ, అంగన్వాడీ టీచర్ రేణుక, రజిని, గర్భిణులు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

