తూప్రాన్/మనోహరాబాద్, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):
రైల్వే డబుల్ లైన్ పనులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కూచారం తండా వద్ద ఉన్న ఆర్యూబీ (అండర్పాస్ బ్రిడ్జి)ని రెండు నెలలపాటు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు రైల్వే శాఖ అడ్మిన్ మేనేజర్, పర్సనల్ రిలేషన్స్ అధికారులు సోమసుందర్, రాకేష్ వెల్లడించారు.
శనివారం రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో మనోహరాబాద్ మండలం కూచారం తండా వద్ద ఉన్న ఛానల్ నంబర్ 587తో పాటు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోనాయిపల్లి వద్ద ఉన్న ఛానల్ నంబర్ 695ఏ వద్ద రైల్వే డబుల్ లైన్ పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పనుల కారణంగా కూచారం తండా ఆర్యూబీని రెండు నెలలపాటు మూసివేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ఆర్యూబీ మార్గంలో రాకపోకలు నిలిచిపోనున్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
రైల్వే డబుల్ లైన్ పనులకు వాహనదారులు, స్థానిక ప్రజలు సహకరించాలని రైల్వే శాఖ అడ్మిన్ మేనేజర్, పర్సనల్ రిలేషన్స్ అధికారులు సోమసుందర్, రాకేష్ కోరారు. రాకపోకల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూ
చించారు.
