Type Here to Get Search Results !

ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించి బలోపేతం చేయాలి.. ప్రైవేటీకరణను అడ్డుకుని కార్మిక హక్కులు కాపాడాలి: ఈశ్వర్‌రావు

 



తూప్రాన్, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):

ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించి మరింత బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణను అడ్డుకుని ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాపాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్‌రావు అన్నారు. తూప్రాన్‌లోని శివ సాయి ఫంక్షన్ హాల్‌లో “ప్రభుత్వ రంగ సంస్థలు–వాటి పరిరక్షణ” అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఈశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ప్రజల ఆస్తులని అన్నారు. విద్యుత్, బ్యాంకింగ్, రవాణా, ఉక్కు, బొగ్గు తదితర కీలక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈశ్వర్‌రావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకుని, వాటి అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కేవలం ఉద్యోగులు, కార్మికుల సమస్య మాత్రమే కాదని, దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షులు ఏ. మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. నర్సింహులు, రవీంద్ర ప్రసాద్, అడ్వైజర్ స్వామి, ఉపాధ్యక్షులు నాగరాజు, ఫాసి, హనుమంత్, అశోక్, వెంకటేష్, శ్రీను, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language