హౌసింగ్ బోర్డ్ వినాయక మండపంలో వాస్తు పూజ
వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
అందోలు
, సెప్టెంబర్ 9 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అందోలు–జోగిపేట మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ సాయి బాలాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం ఏర్పాటు చేశారు.
ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు.. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రముఖ బిల్డర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సురోత్తం రెడ్డి–కృష్ణవేణి, ప్రముఖ వ్యాపారవేత్త సార శివకుమార్–పద్మ దంపతుల ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద వాస్తు పూజతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.
అనంతరం వినాయక నవరాత్రి ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న కాలనీ పెద్దలను శ్రీ సాయి బాలాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

