విద్యుత్ షాక్తో యువకుడు దుర్మరణం
పాపన్నపేట, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన పాపన్నపేట మండల పరిధిలోని చిత్రియాల్ శివారులోని ఏనే సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల కుమార్ (35) వ్యవసాయంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఏనే ప్రాంతంలో షెడ్డు నిర్మాణానికి సంబంధించిన ఇనుప సామగ్రిని ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ ఇనుప రాడ్డు సమీపంలోని హెచ్టీ విద్యుత్ సరఫరా లైన్కు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి కుమార్కు తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది.
ప్రమాద తీవ్రతకు కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి కుమార్ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడికి భార్య దుర్గమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్ మృతితో గాజులగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

