హోరాహోరీగా రాక్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు
నర్సాపూర్, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో అజయ్ యాదవ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభమైన నేషనల్ రాక్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను చాటుతూ హోరాహోరీగా పోటీపడ్డారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు. దీంతో కళాశాల ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
పోటీలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, అజయ్ యాదవ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మురళీధర్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ తదితరులు సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను వీక్షించారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. అజయ్ యాదవ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సాపూర్లో జాతీయ స్థాయి రాక్బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీల ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుందని, యువత క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకోవాలని వారు సూచించారు.
