నాలుగు వారాల్లో నర్సాపూర్ మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికలు పూర్తి చేయాలి
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
నర్సాపూర్, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): నర్సాపూర్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎన్నికను నిర్వహించకపోవడంపై బీజేపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు గోడ రాజేందర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీ కోసం సంబంధిత అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించినప్పటికీ, తదుపరి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయలేదని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.
పిటిషనర్ తరఫున హైకోర్టు న్యాయవాది పూసల నరేష్ వాదనలు వినిపించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. నర్సాపూర్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు న్యాయవాది పూసల నరేష్ తెలిపారు.
హైకోర్టు ఆదేశాలతో నర్సాపూర్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను అధికారులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
