జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం
– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ కమిటీ అధ్యక్షుడు పి. రాంచందర్
తెలుగు ట్రెండ్స్, అందోలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర యాక్టింగ్ కమిటీ అధ్యక్షుడు పి. రాంచందర్ అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలోని విశ్వకర్మ భవన్లో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మునిగాల మాణిక్ ప్రభు అధ్యక్షతన నారాయణఖేడ్ డివిజన్ 3వ మహాసభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పి. రాంచందర్ మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల వృత్తి అనేక సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న విధంగా అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు, హెల్త్ కార్డు, రైల్వే రాయితీ, ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
టీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగా నారాయణఖేడ్ డివిజన్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లభించాయని తెలిపారు. మిగిలిన అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు కల్పించే వరకు సంఘం తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు.
జర్నలిస్టుల వినతిపై ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కృష్ణయ్య, పాండు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. రఘు, బి. రాజశేఖర్, సంగారెడ్డి డివిజన్ అధ్యక్షుడు రాజు గౌడ్, నారాయణఖేడ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి యం.ఏ. ఖైసర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

