మెదక్, సెప్టెంబర్ 27 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ పట్టణంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన మెదక్ టౌన్ పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేసి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హవేలీఘనాపూర్ మండలం తొగిత గ్రామానికి చెందిన మాచబోయిన మహేష్ కుమార్ (సుమారు 30)ను పోలీసులు అరెస్ట్ చేశారు మెదక్ పట్టణం కి చెందిన ప్రభుత్వ ఉద్యోగి మల్లారెడ్డి రామవ్వ ఇంట్లో సెప్టెంబర్ 20న చోరీ జరిగింది. ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన ఆమె తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని స్టీల్ బీరువాను తెరిచి పరిశీలించగా సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ.30 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక
పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు సెప్టెంబర్ 27న చామన్ ప్రాంతంలో అతడిని అనుమానాస్పదంగా గుర్తించారు. పోలీసులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పోలీసులు వెంబడించి అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ.8 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు రూ.14.38 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
మరో చోరీ కేసు కూడా వెలుగులోకి..
నిందితుడి విచారణలో హవేలీఘనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ ఆలయంలో జరిగిన చోరీకి సంబంధించిన వివరాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆలయం తాళం పగులగొట్టి హుండీని ధ్వంసం చేసి నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కొంత నగదును కూడా నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ డి. మహేష్, ఎస్ఐ నారాయణ, మల్లేశం పీసీ-260, నర్సింలు పీసీ-2199 తదితరులు దర్యాప్తులో పాల్గొన్నారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
