Type Here to Get Search Results !

నార్సింగి దారిదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల సందడి

 




నార్సింగిలో దారిదేవుని ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు

ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల సందడి.. ప్రత్యేక అభిషేకాలు, అన్నదానం

పాపన్నపేట, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామ శివారులో కొలువుదీరిన దారిదేవుని (శివాలయం) ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఆలయ పూజారులు జంగం దారప్ప, ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయాన్నే గణపతి పూజతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పరమశివుడికి పళ్ల రసాలతో విశేష అలంకరణ చేసి, పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష రుద్రాభిషేకం, బిల్వార్చన, లింగార్చన తదితర పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన నిర్వహించడంతో పాటు ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తమ కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.

భక్తులకు అన్నదానం

ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా టేక్మాల్, పాపన్నపేట మండలాలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శివుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో పాటు అభిషేకాలు, అర్చనల్లో పాల్గొన్నారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో దారిదేవుని ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language