నర్సాపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
నర్సాపూర్, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): అసెంబ్లీ ఆవరణలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనను నిరసిస్తూ సోమవారం నర్సాపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే నివాసం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఆందోళన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో నర్సాపూర్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేకు జరిగిన ఘటనపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, కౌన్సిలర్లు బుల్లెట్ రాజు, మోహిజుద్దీన్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు పంబళ్ల బిక్షపతి, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, సర్పంచులు గుండె శివకుమార్, స్రవంతి కరుణాకర్, తులసమ్మ బిక్షపతి, వర్ష సుదీప్, సునీత రాములు నాయక్, సుధాకర్, పోచయ్య, మాజీ సర్పంచులు సురేష్ గౌడ్, సామ్యానాయక్, నాయకులు రింగుల ప్రసాద్, నాగరాజు గౌడ్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
