హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
పాపన్నపేట, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పాపన్నపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాపన్నపేట సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
అనంతరం తహసీల్దార్ సతీష్‌కుమార్‌ను కలిసి ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు బోనస్ విషయంలో కేవలం ఏడు రకాలకే పరిమితం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
రైతులకు నష్టం కలిగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, పాపన్నపేట మాజీ సర్పంచ్ తిమ్మయగారి గురుమూర్తి గౌడ్, అరెపల్లి మాజీ సర్పంచ్ శ్రీనాథ్‌రావు, వెంకటేశం, నార్సింగి సర్పంచ్ దారబోయిన మల్లేశం, మాజీ సర్పంచులు బాబాగౌడ్, కిష్టాగౌడ్, శ్రీనివాస్, బాల్‌రెడ్డి, సిద్దిరామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
