జోగిపేట, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్):
గత తొమ్మిది రోజులుగా భక్తులచే విశేష పూజలు అందుకున్న గణనాథులను శనివారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. గణపయ్యకు వీడ్కోలు పలుకుతూ ఒకవైపు బాధ, మరోవైపు భక్తి భావంతో భక్తులు నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లారు. వివేకానంద యూత్, వాసవి నగర్ టీం, శ్రీ పోచమ్మ యూత్, తూర్పు గౌని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులు భక్తులను ఆకట్టుకున్నారు.
అదేవిధంగా చిన్ని కృష్ణుడి అవతారంలో అలంకరించిన బాలగణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణనాథుల శోభాయాత్రలో యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలు, నినాదాలతో సందడి చేశారు.
తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్యలను ఘనంగా సాగనంపుతూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు.



