ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు రక్షణ కల్పించాలి
కార్మికులపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి: సీఐటీయూ
జోగిపేట, సెప్టెంబర్ 10 (తెలుగు ట్రెండ్స్):
జోగిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రక్షణ కల్పించాలని, కార్మికులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆందోల్ డివిజన్ కార్యదర్శి డి. విద్యాసాగర్ డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారం, రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం జోగిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డి. విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ కాంట్రాక్టు పద్ధతిలో ఆసుపత్రిలో సుమారు 48 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24 గంటల పాటు ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న కార్మికులకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులపై కొందరు దుర్భాషలాడుతూ, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళా కార్మికులు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యం, సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
కార్మికులపై దాడులు పునరావృతం కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు విధి నిర్వహణలో పూర్తి రక్షణ కల్పించాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించడంలో కాంట్రాక్టు కార్మికుల పాత్ర కీలకమని, అలాంటి కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సీఐటీయూ నాయకులు అన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు ప్రభాకర్, మల్లేశం, భీమ్రావు, శ్రవణ్, హరికృష్ణ, జయమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.
