మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్య ప్రవర్తనపై ఆందోల్లో నిరసన
జోగిపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
తెలుగు ట్రెండ్స్: అందోలు
(చాపల సత్యం):
అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల చోటుచేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం జోగిపేట పట్టణంలో మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
సోమవారం అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జోగిపేటలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్రాంతి కిరణ్, మహిళా నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భావించే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి రావడంలో తప్పేముందని ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా ఎలాంటి చర్యలు జరిగినా వాటిని సమర్థించలేమని క్రాంతి కిరణ్ అన్నారు. రాజకీయంగా పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం, మర్యాద పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై ప్రభుత్వం సమగ్రంగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల గౌరవానికి సంబంధించిన అంశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
కౌరవ సభలో ద్రౌపది అవమానానికి గురైన ఘటనను ప్రస్తావించిన క్రాంతి కిరణ్.. మహిళలను అవమానించడం ఎప్పటికీ సమర్థనీయం కాదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన ఘటనలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. మహిళల గౌరవం, హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నిరసన ర్యాలీలో ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

