11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు మతిస్థిమితం లేని బాలిక
ఆధార్ ఆధారంగా తల్లిదండ్రుల ఆచూకీ గుర్తించిన జిల్లా సంక్షేమ శాఖ
మెదక్, సెప్టెంబర్ 8 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): 11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన మతిస్థిమితం లేని బాలికను తల్లిదండ్రుల ఆచూకీ గుర్తించి వారి చెంతకు చేర్చినట్లు జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.
జిల్లా సంక్షేమ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన దంపతుల కుమార్తె సుమారు 11 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి తప్పిపోయింది. అనంతరం ఆమె మెదక్ జిల్లా బేతాని సంరక్షణ ఆశ్రమంలో చేరి, అప్పటి నుంచి అక్కడే ఆశ్రయం పొందుతూ ఉంది.
బాలికకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆమె తల్లిదండ్రుల వివరాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ఆధార్ కార్డు కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ దరఖాస్తు తిరస్కరణకు గురైనట్లు హేమ భార్గవి తెలిపారు. అయినప్పటికీ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నాలు కొనసాగించారు.
ఈ క్రమంలో బాలికను మాదాపూర్లోని ఆధార్ కేంద్రంలో నమోదు చేయించగా ఆధార్ నంబర్ జారీ అయింది. ఆధార్ వివరాల ఆధారంగా బాలిక తల్లిదండ్రుల ఆచూకీని అధికారులు గుర్తించారు. అనంతరం వారిని మెదక్కు పిలిపించి, 11 ఏళ్లుగా బేతాని సంరక్షణ ఆశ్రమంలో ఉన్న బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
తమ కుమార్తెను ఇన్నేళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం, సంతోషం వ్యక్తం చేశారు. బాలికను తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో కృషి చేసిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్, సరిత, మంజుల, బేతాని ఆశ్రమ సోషల్ వర్కర్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
