విద్యార్థులకు యూనిఫాంలు, షూస్ పంపిణీ
ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి: సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్
కొల్చారం, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలోని యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, బెల్టులు, షూస్, సాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ (గజినీ), ఉపసర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులు సదాల నర్సింలు, రామానుజన్, ఏఏసీ చైర్మన్ అనిత తదితరులు పాల్గొని విద్యార్థులకు సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతూ తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వివిధ సౌకర్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. చదువుతోనే మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని అన్నారు.
పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా బోధిస్తున్నారని పేర్కొంటూ.. తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి పిల్లలు చదువుతున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. నారాయణ, ఉపాధ్యాయులు శ్వేతారాణి, మాధవి, చైతన్య, నాయకులు వీరేశం, కదూరి అంజం, పితిరి రవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, షూస్, సాక్స్, బెల్టులు అందడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
