ఎమ్మెల్యేకు అవమానమా..? మహిళలకు రక్షణ ఎక్కడ?
సునీత లక్ష్మారెడ్డికి జరిగిన ఘటనపై కొల్చారంలో బీఆర్ఎస్ ధర్నా.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర నిరసన
కొల్చారం, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): అసెంబ్లీ ప్రాంగణంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి జరిగిన అవమానకర ఘటనను నిరసిస్తూ కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె పట్ల దురుసుగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
“కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు, మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ ఎక్కడ? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?” అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మెదక్–హైదరాబాద్ రహదారిపై ధర్నా
కొల్చారం ప్రధాన రహదారి అయిన మెదక్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితిని గమనించిన కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం నాయకులు పోలీస్‌స్టేషన్ ఎదుట కూడా నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఎస్సై మరోసారి వారితో మాట్లాడి ఆందోళన విరమించేలా నచ్చజెప్పారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యే పట్ల జరిగిన ఘటనను తేలికగా తీసుకోవద్దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను గౌరవిస్తామని చెప్పే ప్రభుత్వం ఆచరణలోనూ అదే విధానాన్ని చూపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తుంకులపల్లి సంతోష్‌రావు, రవితేజ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ అరిగి రమేష్‌కుమార్, నరేందర్‌రెడ్డి, పి. రాజుగౌడ్, పలువురు సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


