ఫీజు బకాయిలపై బీజేపీ పోరుబాట.. నాయకుల అరెస్టుపై నిరసన
రూ.15 వేల కోట్ల బకాయిలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్
మనోహరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన దీక్షకు వెళ్తున్న తమ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ మనోహరాబాద్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకుని అరెస్టు చేయడం సరికాదన్నారు. సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం ఉద్యమకారులను అరెస్టు చేయడం ద్వారా ప్రజల గొంతును అణచివేయాలని చూస్తోందని విమర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీ మనోహరాబాద్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్తో పాటు బీజేవైఎం నాయకులు కొల్తూరి నరేష్ గౌడ్, రితేష్ ముదిరాజ్, రచ్చ శ్రీకాంత్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
“అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు”
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యపై పోరాడుతున్న తమను అరెస్టు చేయడం ద్వారా ఉద్యమాన్ని నిలువరించలేరని వెంకటేష్ గౌడ్ అన్నారు. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
“విద్యార్థుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు.. వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. ఫీజు బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి” అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, నిరసనలను అణచివేయడం కాకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు.
