మెదక్ జిల్లా విద్యారంగానికి గర్వకారణం.. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా చౌదరి వాసవి
రవీంద్రభారతిలో ఘన సన్మానం.. పలువురు ప్రముఖుల అభినందనలు
హైదరాబాద్/మెదక్, సెప్టెంబర్ 8 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మెదక్ జిల్లా నర్సింగి మండలంలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చౌదరి వాసవి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
టీచర్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 డి – స్నేహ బంధు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చౌదరి వాసవిని ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక రవీంద్రభారతిలో ఆమెను ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చౌదరి వాసవి చేస్తున్న కృషిని వారు అభినందించారు.
విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారి ప్రతిభను వెలికితీసేందుకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగానే ఈ పురస్కారం లభించిందని పలువురు కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి ఇలాంటి అవార్డులు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ బాబూరావు, మల్టిపుల్ చైర్మన్ అమృత్రావు, ఆర్సీ రమేష్, రామాయంపేట చైర్మన్ ఎల్ఎన్ దామోదర్రావు, మహిళా ఎల్ఎన్ శకుంతల, రామాయంపేట కౌన్సిలర్ చౌదరి చరితారావు, చౌదరి పృథ్వీరావు తదితరులు పాల్గొని చౌదరి వాసవిని అభినందించారు.
మెదక్ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయిలో సత్కారం అందుకోవడం నర్సింగి ప్రాంతానికే కాకుండా మెదక్ జిల్లా విద్యారంగానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.


