ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం.. నాణ్యమైన వైద్య సేవలే ధ్యేయం
రామాయంపేట సీహెచ్సీని సందర్శించిన డీసీహెచ్ఎస్ డాక్టర్ శివ దయాల్
రామాయంపేట, సెప్టెంబర్ 8 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): మెదక్ జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం పనిచేస్తోందని డీసీహెచ్ఎస్ డాక్టర్ శివ దయాల్ తెలిపారు.
మంగళవారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని ఆసుపత్రి పరిస్థితులు, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ వైద్య నిపుణుల సేవలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శివ దయాల్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ వైద్యశాఖ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డీఎంహెచ్ఓ డాక్టర్ గణేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నామని చెప్పారు.
అందులో భాగంగానే రామాయంపేట సీహెచ్సీని సందర్శించి ఆసుపత్రి పనితీరు, వైద్య సేవలను పరిశీలించినట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏదైనా ప్రాంతంలో తీవ్రమైన జ్వరాలు లేదా సీజనల్ వ్యాధుల ప్రభావం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, వ్యాధి తీవ్రతకు అనుగుణంగా పరీక్షలు, చికిత్స అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా వైద్య సేవలను మెరుగుపరచాలని డాక్టర్ శివ దయాల్ సూచించారు. ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
