తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త బండిలోనే వేయాలి
– సర్పంచ్ తుల్చమ్మ బిక్షపతి
నర్సాపూర్, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):
గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అచ్చంపేట సర్పంచ్ తుల్చమ్మ బిక్షపతి సూచించారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే చెత్త సేకరణ వాహనంలోనే వేయాలని ఆమె ప్రజలను కోరారు.
గురువారం నర్సాపూర్ మండల పరిధిలోని అచ్చంపేట గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలి, చెత్తను ఎక్కడ వేయాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తుల్చమ్మ బిక్షపతి మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం పంచాయతీ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం తమ వంతు సహకారం అందించాలని అన్నారు. చెత్తను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో పడేయకుండా చెత్త సేకరణ వాహనానికి అందించాలని సూచించారు.
అచ్చంపేటను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ ఆంజనేయులు, నర్సమ్మ, వరమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రావణి సింధుజ, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
