మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు.. ఫాలోవర్లు, వ్యూస్ కోసం నాటకం
మెదక్, సెప్టెంబర్ 25 (తెలుగు ట్రెండ్స్): మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు పెట్టి తూప్రాన్‌లో కలకలం సృష్టించిన ఘటన వెనుక అసలు విషయాన్ని మెదక్ జిల్లా పోలీసులు ఛేదించారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు (23), చింతకింది శ్రీధర్ (23)లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుంచి బైక్, రెండు మొబైల్ ఫోన్లు, నల్లరంగు రెయిన్‌కోట్, శాలువా, పెన్నులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి..
సెప్టెంబర్ 21/22 అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో మాస్క్ ధరించిన వ్యక్తి తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి ఎర్ర వస్త్రంలో చుట్టిన బెదిరింపు లేఖను రిసెప్షన్ టేబుల్‌పై ఉంచి వెళ్లిపోయాడు. బయట మరో వ్యక్తి బైక్‌పై వేచి ఉన్నాడు. అదే సమయంలో తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా ఇలాంటి లేఖను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.
మేడారం ఘటన తర్వాత తూప్రాన్‌లో మరోసారి..
సెప్టెంబర్ 16న సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా కూడా మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వెలుగుచూడటంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కదలికలను గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియాలో ప్రచారం, ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. మేడారం ఘటనకు ఆశించిన స్థాయిలో ప్రచారం రాలేదనే ఉద్దేశంతో తూప్రాన్‌లో మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఏఐ సహాయంతో లేఖల తయారీ..
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు బండ మధు ఏఐ సహాయంతో లేఖను రూపొందించి, అందులో మార్పులు చేసి మూడు లేఖలను సిద్ధం చేశాడు. వాటిపై ‘ALEXENDAR APTH’, ‘గణపతి అన్న’ పేర్లతో పాటు కొడవలి, సుత్తి గుర్తులను ఉంచినట్లు ఎస్పీ తెలిపారు.
సెప్టెంబర్ 21/22 అర్ధరాత్రి మధు, శ్రీధర్ బైక్‌పై తూప్రాన్‌కు వచ్చి ముందుగా మున్సిపల్ కార్యాలయం వద్ద లేఖతో కూడిన ఎర్ర వస్త్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మధు మాస్క్, రెయిన్‌కోట్ ధరించి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి లేఖను టేబుల్‌పై ఉంచడంతో పాటు మొబైల్ ఫోన్లో వీడియో చిత్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఫొటోలు, వీడియోలను సన్నిహితులకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
నాగులపల్లి బ్రిడ్జి వద్ద అరెస్ట్..
నిందితుల ఆచూకీపై అందిన సమాచారంతో సెప్టెంబర్ 24న సాయంత్రం సుమారు 7 గంటలకు నాగులపల్లి బ్రిడ్జి వద్ద బండ మధు, చింతకింది శ్రీధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ ఐపీఎస్ పర్యవేక్షణలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ నేతృత్వంలో ఎస్ఐ గంగరాజు, ప్రత్యేక బృందం, ఐటీ కోర్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఇలాంటివి చేయొద్దు..
సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారాలు, బెదిరింపు లేఖలు లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించే చర్యలకు పాల్పడొద్దని పోలీసులు సూచించారు. సరదా కోసం చేసినా ఇలాంటి చర్యలు చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కంటే బాధ్యతాయుతమైన ప్రవర్తనే ముఖ్యమని పోలీసులు స్పష్టం చేశారు.

