సీఈసీ రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ మహేందర్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (తెలుగు ట్రెండ్స్): దేశంలో ఎన్నికల సంఘం పనితీరు, నిర్ణయాలపై ప్రజలు, మేధావులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ మహేందర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గత పది నెలల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై కనీసం 14 సందర్భాల్లో అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు–పునరుద్ధరణ, ఫారమ్-6 మార్పులు, ఓటర్ల డేటా నిర్వహణ వంటి కీలక అంశాలపై ఈ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కొన్ని చర్యలను “Unauthorised”, “Illegal”గా పేర్కొంటూ కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని మహేందర్రెడ్డి అన్నారు. ఓటర్ల డేటాబేస్ను కేంద్రీకృతం చేయడం, ఎన్నికల సాఫ్ట్వేర్పై నియంత్రణ వంటి అంశాలపైనా వారు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.
గతంలో బెంగాల్లో 90 లక్షల ఓట్ల తొలగింపు, అస్సాంలో 45 లక్షల ఓట్ల తొలగింపు, బీహార్లో 45 లక్షల ఓట్ల తొలగింపు, హర్యానాలో 25 లక్షల దొంగ ఓట్ల చేర్పు, మహారాష్ట్రలో 50 లక్షల దొంగ ఓట్ల చేర్పు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
గోవాలో 97 మంది అర్హులైన ఓటర్ల విషయంలో సాఫ్ట్వేర్ సమస్య కారణంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాలను నమోదు చేయడంలో ఇబ్బంది ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల హక్కులు కేవలం అధికారుల నిర్ణయాలపైనే కాకుండా సాంకేతిక వ్యవస్థపైనా ఆధారపడే పరిస్థితి రావడం ఆందోళనకరమని అన్నారు.
దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు, ఓటర్ల నమోదు వంటి అంశాల్లో ఎవరి ఆదేశాల మేరకు చర్యలు జరుగుతున్నాయో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల నిర్వహణలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న లోపాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను దేశ ప్రజల ముందుంచాలని కోరారు.
ఈ అంశాలపై పూర్తి నిజాలు ప్రజల ముందుకు రావాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ వ్యవహారాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
