పుస్తెలతాడుపై దొంగల కన్ను!
మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లేందుకు యత్నం.. చాకచక్యంగా పట్టుకున్న యువకులు
వెల్దుర్తి
, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్తున్న మహిళను ఇద్దరు వ్యక్తులు వెంబడించి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు యత్నించిన ఘటన వెల్దుర్తి మండల కేంద్రంలో కలకలం రేపింది. అయితే మహిళ అప్రమత్తంగా ప్రతిఘటించడంతో పాటు సమీపంలోని వినాయక మండపం వద్ద ఉన్న యువకులు వెంటనే స్పందించడంతో వారి ప్రయత్నం విఫలమైంది.
కోట కింద వీధికి చెందిన ఉప్పల కమలమ్మ శనివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో వెల్దుర్తి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి సమీపంలోని నెల్లూరమ్మ ఇంటి వద్దకు చేరుకోగానే అప్పటికే కాపుకాసిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
అయితే అప్రమత్తమైన కమలమ్మ వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పుస్తెలతాడు కిందపడిపోయింది. ఇదే సమయంలో సమీపంలోని వినాయక మండపం వద్ద ఉన్న యువకులు ఘటనను గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు శివంపేట మండలానికి చెందిన వారిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు.
ఊహించని రీతిలో జరిగిన ఈ ఘటనతో స్థానిక మహిళలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో మార్కెట్, ప్రధాన వీధులు, నివాస ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

