Type Here to Get Search Results !

తుక్కాపూర్‌లో మెగా ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్ రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన

 


మెగా ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌.. రైతులకు అవగాహన

కొల్చారం, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): రైతులను ఆయిల్‌పామ్‌ సాగు వైపు ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పంట ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు కొల్చారం మండలం తుక్కాపూర్‌ గ్రామంలో మెగా ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో చేపడుతున్న మెగా ప్లాంటేషన్‌లో భాగంగా కొల్చారం మండలంలో ఇప్పటివరకు 31 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా డిహెచ్ఎస్ఓ ప్రతాప్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్‌ సాగు విధానం, పంట ద్వారా లభించే ప్రయోజనాలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, డ్రిప్‌ పరికరాలపై రాయితీలను రైతులకు వివరించారు. మొక్కలు, డ్రిప్‌ పరికరాలకు ప్రభుత్వం 90 శాతం వరకు రాయితీలు అందిస్తోందని తెలిపారు.

ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటే రైతులకు మొదటి సంవత్సరం రూ.11,001 రాయితీతో పాటు తదుపరి సంవత్సరాల్లో నిర్వహణకు రూ.4,200 చొప్పున ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. మొత్తంగా రూ.16,800 వరకు రాయితీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్‌ పరికరాలపై రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్‌ గెల ధర సుమారు రూ.24,025గా ఉందని, దీంతో ఎకరానికి సంవత్సరానికి సుమారు రూ.2.05 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. సాగు ఖర్చులు మినహాయించిన తర్వాత సుమారు రూ.1.50 లక్షల వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.

కార్యక్రమంలో భాగంగా రైతు అడకులపల్లి దుర్గారాణి పొలంలో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందే అవకాశం ఉన్నందున రైతులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో కొల్చారం ఎమ్మార్వో శ్రీనివాస్ ఆచారి, ఏవో శ్వేత కుమారి, మేనేజర్ కృష్ణారావు, తుక్కాపూర్‌ సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ అరె రవీందర్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, అసిస్టెంట్ మేనేజర్ సూర్య, ఫీల్డ్ ఆఫీసర్లు మణి ప్రకాష్, ప్రణీత్, ఆయిల్‌పామ్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language