Type Here to Get Search Results !

హామీలు వందలు.. అమలు మాత్రం శూన్యం: పద్మ దేవేందర్‌రెడ్డి ఆటో కార్మికులకు రూ.24 వేల బకాయి వెంటనే చెల్లించాలి

 




హామీలు వందలు.. అమలు మాత్రం శూన్యం: పద్మ దేవేందర్‌రెడ్డి

ఆటో కార్మికులకు రూ.24 వేల బకాయి వెంటనే చెల్లించాలి

మెదక్, సెప్టెంబర్ 7 (తెలుగు ట్రెండ్స్): ఎన్నికల సమయంలో వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజుల పాలన పూర్తయినా అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్‌ నాయకురాలు ఎం. పద్మ దేవేందర్‌రెడ్డి ఆరోపించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

ఎన్నికల హామీల అమలుకు డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన పోరుబాటలో భాగంగా సోమవారం మెదక్‌లో భారీ ఆటో, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పద్మ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, ఆటో కార్మికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్‌ వ్యవసాయ మార్కెట్‌ కమాన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ఆటోలు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పద్మ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు నిరుద్యోగులకు నెలకు రూ.12 వేల జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని విస్మరించిందని ఆరోపించారు. నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఆటో కార్మికులకు రూ.24 వేల బకాయి

ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని పద్మ దేవేందర్‌రెడ్డి అన్నారు. దీంతో ఒక్కో ఆటో కార్మికుడికి రూ.24 వేల బకాయి పడిందని పేర్కొన్నారు. వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలు, నిరుద్యోగులు, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, లేకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా పోరాటాలు చేపడతామని పద్మ దేవేందర్‌రెడ్డి హెచ్చరించారు. నిరుద్యోగులు, మహిళలు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్‌ మామిల్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language