కొల్చారంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
ప్రధాన వీధులు, కాలనీల్లో మందు పిచికారీ.. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
కొల్చారం, సెప్టెంబర్ 15 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొల్చారం మండల కేంద్రంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, వివిధ కాలనీలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ మందును పిచికారీ చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా మందు పిచికారీ చేపట్టినట్లు గ్రామ ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి, దోమలు వృద్ధి చెందే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దేవన్నగారి శేఖర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు.
గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారీతో పాటు ఫాగింగ్ వంటి చర్యలు కూడా చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.
దోమల నివారణ కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి గోపి, వార్డు సభ్యులు కృష్ణ, చింతల కృష్ణ, యాదగిరి, డాక్టర్ బాలరాజు, ప్రవీణ్, షేకులు, వనమాల శ్రీధర్, గ్రామ ప్రజాప్రతినిధులు మహేశ్వర్ రెడ్డి, దేవన్నగారి ప్రశాంత్, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
