Type Here to Get Search Results !

మండల సమీక్షకు అధికారుల డుమ్మా.. సమస్యలు చెప్పేందుకు సర్పంచులు, పరిష్కరించేందుకు అధికారులు కరువు!

 



మండల సమీక్షకు అధికారుల డుమ్మా!

సమస్యలు కొండంత.. అధికారుల స్పందన శూన్యం!
అధికారుల గైర్హాజరుపై సర్పంచుల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామన్న ఎంపీడీవో

వెల్దుర్తి, సెప్టెంబర్ 21 (తెలుగు ట్రెండ్స్):
ప్రజలకు చేరువగా పాలన అందించాలనే లక్ష్యంతో నిర్వహించే మండలస్థాయి సమీక్ష సమావేశానికే కొంతమంది అధికారులు గైర్హాజరు కావడంపై గ్రామాల సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజులకు ఒకసారి నిర్వహించే మండలస్థాయి సమీక్ష సమావేశానికి అధికారులు హాజరుకాకపోతే గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎలా పర్యవేక్షిస్తారని వారు ప్రశ్నించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారంలో జాప్యం తప్ప స్పందన కనిపించడం లేదని మండిపడ్డారు.

సోమవారం మండల జిల్లా పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ రాకేశ్ అధ్యక్షతన మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీడీవో విగ్నేశ్వర్, తహసీల్దార్ విజయలక్ష్మి తదితర అధికారులు హాజరయ్యారు. అయితే గ్రామాల నుంచి సమస్యలతో వచ్చిన సర్పంచులు, ప్రజాప్రతినిధులకు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది.

సమస్యలు చెప్పుకోవడానికి సమావేశం.. పరిష్కారానికి మాత్రం ఎదురుచూపులా? అంటూ సర్పంచులు ప్రశ్నించారు. విద్యుత్, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ఉపాధిహామీ, పంచాయతీ వ్యవహారాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలు చూపాల్సిన సమావేశం.. అధికారుల గైర్హాజరుతో ఆశించిన ప్రయోజనం అందించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్కో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పరిష్కారం ఎప్పుడు? చర్యలు ఎక్కడ? అనే పరిస్థితి నెలకొంటోందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు.

కొన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడంతో పల్లెల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పల్లెల్లో సబ్‌సెంటర్లు, ఏఎన్‌ఎంల కొరతతో ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఏఎన్‌ఎంలు అందుబాటులో లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.

ఉపాధిహామీ పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొన్ని గ్రామాల్లో ఇప్పటి నుంచే తాగునీటి కొరత నెలకొంటోందని సర్పంచులు తెలిపారు. ప్రస్తుతం తాగునీటి పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవిలో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండలస్థాయి సమావేశంలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచులు డిమాండ్ చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను ఫైళ్లలో కాకుండా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ మాట్లాడుతూ మండలస్థాయి సమీక్ష సమావేశానికి గైర్హాజరైన అధికారుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language