జీఓ 97 రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మద్దతు
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది: చంటి క్రాంతికిరణ్
అందోలు-జోగిపేట, సెప్టెంబర్ 9 (తెలుగు ట్రెండ్స్): జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అందోలు-జోగిపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించేందుకు ఆయన బుధవారం పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు.
క్రాంతికిరణ్ కళాశాల వద్దకు చేరుకున్న సమయంలో విద్యార్థులను కళాశాల లోపలే ఉంచి బయటకు రాకుండా తాళాలు వేసినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆయనను కళాశాలలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో, కళాశాల ఆవరణ బయట తన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. ఇదే సమయంలో కళాశాల లోపల ఉన్న విద్యార్థులు కూడా నిరసన నినాదాలు చేశారు.
కళాశాల ఆవరణలో క్రాంతికిరణ్ నిరసన వ్యక్తం చేయడంతో అనంతరం ప్రిన్సిపాల్, పోలీసు అధికారులు ఆయన ఒక్కరిని లోపలికి వెళ్లి విద్యార్థులను కలిసేందుకు అనుమతించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. జీఓ నంబర్ 97 కారణంగా పాలిటెక్నిక్ విద్య నిర్వీర్యమవుతుందనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొందన్నారు. పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్ విద్యతోపాటు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
జీఓ నంబర్ 97 రద్దు అయ్యే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి. జైపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు పి. నారాయణ ముదిరాజ్, అర్జునయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ డీబీ నాగభూషణం, డాకూర్ సర్పంచ్ వసంత్‌రెడ్డి, కౌన్సిలర్ నాగరత్నం గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, సార శ్రీధర్, బిర్ల శంకర్, ఖాజా పాషా, కరుణాకర్, ఉలువల వెంకటేశం, రవీందర్ గౌడ్, పల్లె వెంకట రమణ, ఇమ్రాన్ ఖాన్, విజయ్‌కుమార్, సాయికుమార్, తాలుక లక్ష్మణ్, పవన్ ముదిరాజ్, నర్సింలు, ఉద్ది నాగరాజు, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

