దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు
భువనగిరి, సెప్టెంబర్ 9 (తెలుగు ట్రెండ్స్): దోమల బెడదతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 22వ వార్డు పరిధిలో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ తెలిపారు.
22వ వార్డు పరిధిలోని ఇందిరానగర్, పోచమ్మవాడ, న్యూ రామ్నగర్ కాలనీల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టారు. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాలనీల్లో ఫాగింగ్ చేయించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ.. వార్డులో దోమల సమస్యను దృష్టిలో ఉంచుకుని గత కొద్ది రోజులుగా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి ఫాగింగ్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
వార్డులో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. దోమల వృద్ధికి కారణమయ్యే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భూషాపక మనీష్, గుడ్డెంకి ప్రమోద్, ఇటుకల మహేందర్, బర్రె వరుణ్తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
