ఎండు గంజాయి చాక్లెట్లు స్వాధీనం
218 గ్రాముల డ్రై గంజాయి చాక్లెట్లు పట్టివేత.. ఒకరి అరెస్ట్
నర్సాపూర్, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బందితో కలిసి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 218 గ్రాముల ఎండు గంజాయి చాక్లెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అక్రమంగా డ్రై గంజాయి చాక్లెట్లను కలిగి ఉండటంతో పాటు వాటిని రవాణా చేసి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ ప్రాంతానికి చెందిన రాహుల్గా గుర్తించినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
జిల్లా ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిఘా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారి జ్ఞానేశ్వర్ (శిక్షణ), నర్సాపూర్ ఎస్ఐ శరత్ కుమార్, రవి, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ సందీప్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఫక్రుద్దీన్, మహేష్ తదితరులు పాల్గొన్నా
రు.
